ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఏ-7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ నిరాశ ఎదురైంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం నిరాకరించింది. చట్టం నుంచి తప్పించుకుని విదేశాల్లో తలదాచుకోవడం వల్ల ప్రయోజనం లేదని, తక్షణమే దర్యాప్తుకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముప్పిడి అవినాశ్ రెడ్డి ఈ నెల 26వ తేదీ లోపు సంబంధిత విచారణాధికారి ముందు స్వయంగా హాజరై లొంగిపోవాలని స్పష్టమైన గడువు విధించింది. ఒకవేళ లొంగిపోయిన తర్వాత నిబంధనల ప్రకారం సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అవినాశ్ రెడ్డి శ్రీలంకలో తలదాచుకున్నట్లు దర్యాప్తులో తేలడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
లిక్కర్ స్కామ్ ద్వారా ఆర్జించిన కోట్లాది రూపాయలను రాజ్ కెసిరెడ్డి విదేశాల్లో దాచారని, అందులో అవినాశ్ రెడ్డి పాత్ర కీలకమని ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించడంతో ఆయన లొంగిపోవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే, ఈ స్కామ్లో మరికొంత మంది రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.