హెరిటేజ్‌పై ఆరోపణలకు సీఎం చంద్రబాబు చెక్: అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పష్టత!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్‌పై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. హెరిటేజ్ సంస్థను అప్రతిష్ఠపాలు చేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా వాస్తవాలను వెల్లడించారు. హెరిటేజ్ సంస్థ ఇప్పటివరకు ప్రభుత్వానికి ఒక్క కేజీ నెయ్యిని కూడా సరఫరా చేయలేదని, కేవలం నీతిగా వ్యాపారం చేస్తున్న తమపై బురద చల్లడం దారుణమని ఆయన మండిపడ్డారు.

వివాదానికి కారణమైన పూణేలోని ఇందాపూర్ డెయిరీ గురించి వివరిస్తూ.. అది ఒక పెద్ద ‘కో-మాన్యుఫ్యాక్చరింగ్’ ప్లాంట్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సంస్థ కేవలం హెరిటేజ్‌కే కాకుండా మదర్ డెయిరీ, బ్రిటానియా, అముల్, పతంజలి, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలకు కూడా ఉత్పత్తులను తయారు చేసి ఇస్తుందని గుర్తుచేశారు. అటువంటి థర్డ్ పార్టీ ప్లాంట్‌ను ఉద్దేశించి హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు చేయడం అజ్ఞానమేనని కొట్టిపారేశారు. గత ప్రభుత్వం భారతీ సిమెంట్స్‌ను ప్రభుత్వ పథకాలకు వాడుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తాము ఎప్పుడూ వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోలేదని ఎదురుదాడి చేశారు.

దేవాలయాల పవిత్రత మరియు హైందవ ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు పూర్తి మద్దతు ప్రకటించారు. ఏ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. కల్తీ ఘటనలపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, నిష్పాక్షిక విచారణ ద్వారా దోషులను బయటపెడతామని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *