ఉక్రెయిన్లోని కీలక రాజకీయ నేతలు, మిలిటరీ ఉన్నతాధికారులను అంతమొందించేందుకు రష్యా పన్నిన ఒక భయంకరమైన కుట్రను ఉక్రెయిన్, మోల్డోవా భద్రతా బలగాలు చాకచక్యంగా అడ్డుకున్నాయి. మాస్కో ఆదేశాల మేరకు కిరాయి హంతకులను రంగంలోకి దింపి, ఉక్రెయిన్ నడిబొడ్డున రక్తపాతం సృష్టించాలని చూసిన 10 మంది సభ్యుల అంతర్జాతీయ ముఠాను అధికారులు అరెస్ట్ చేశారు. రష్యాపై యుద్ధం మొదలై నాలుగేళ్లు గడుస్తున్న వేళ, ఉక్రెయిన్ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు రష్యా ఈ ‘కాంట్రాక్ట్ కిల్లింగ్’ వ్యూహాన్ని అమలు చేస్తోందని కీవ్ అధికారులు ఆరోపించారు.
ఈ హంతక ముఠా ప్రధానంగా ఉక్రెయిన్ మిలిటరీ వ్యూహకర్త ఆండ్రీ యూసోవ్ను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. యూసోవ్ ఉక్రెయిన్ సైనిక సమాచార వ్యవస్థను పర్యవేక్షించడమే కాకుండా, రష్యాతో యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తి ఎంత ప్రముఖుడైతే, అంత ఎక్కువ మొత్తంలో నగదు ఇచ్చేలా రష్యా ఒప్పందం చేసుకుందని, ఒక్కో హత్యకు గరిష్టంగా లక్ష డాలర్లు (సుమారు రూ.90 లక్షలు) సుపారీగా వాగ్దానం చేసినట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ వెల్లడించారు.
రెండు దేశాల నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఉక్రెయిన్లో ఏడుగురిని, మోల్డోవాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 20 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, నగదుతో పాటు రష్యా హ్యాండ్లర్లతో జరిపిన రహస్య సంభాషణల ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ నిందితులపై ఉగ్రవాదం, దేశద్రోహం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.