ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామం అభివృద్ధిలో సరికొత్త రూపు సంతరించుకుంటోంది. తన ఇంటి పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలో ఇచ్చిన హామీని పవన్ నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆయన తన వ్యక్తిగత విరాళం రూ. 50 లక్షలతో నిర్మించిన 90,000 లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు పనులు పూర్తయ్యాయి. దీని ద్వారా సుమారు 2,000 మంది గ్రామస్థుల దశాబ్దాల తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం లభించనుంది. వేసవికి ముందే ఈ పనులు పూర్తి కావడం పట్ల పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత విరాళంతో పాటు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులను కొణిదెల గ్రామాభివృద్ధికి పవన్ కల్యాణ్ మంజూరు చేయించారు. ‘పల్లె పండగ’ 1.0 మరియు 2.0 కార్యక్రమాల కింద సుమారు రూ. 65 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. అలాగే, కొణిదెల స్కూల్ నుంచి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్లు, మరో రహదారి పునరుద్ధరణకు రూ. 45 లక్షల నిధులు కేటాయించారు. ఇవే కాకుండా డ్రైన్లు, పాఠశాల అభివృద్ధి పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.
మౌలిక సదుపాయాలతో పాటు వ్యవసాయం, గృహ నిర్మాణ రంగాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి, మైనర్ కాలువల పునరుద్ధరణ మరియు చెక్ డ్యామ్‌ల మరమ్మతులు పూర్తి చేశారు. నిరుపేదల కోసం గృహ నిర్మాణ శాఖ ద్వారా 19 ఇళ్లు, పశువుల కోసం గోకులాలు నిర్మించారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాకుండా, ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించి కొణిదెల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు