తేది:19-02-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించి, సంగారెడ్డి జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు.
గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా,ఆర్ & బి , రవాణా, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పరిస్థితిని శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాలు, ముఖ్యంగా జాతీయ రహదారులపై చోటుచేసుకున్న ప్రమాదాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల గణాంకాలు, కారణాల పై సమగ్ర విశ్లేషణ చేయాలన్నారు.తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను “బ్లాక్ స్పాట్స్”గా గుర్తించి, అక్కడ తక్షణమే హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్స్ ఏర్పాటు చేయడం, రోడ్ల మరమ్మతులు వంటి చర్యలను చేపట్టాలని సూచించారు. అలాగే రహదారుల వెంట పెరిగిన చెట్ల కొమ్మలు, అడ్డంకులు తొలగించడం, సరైన లైటింగ్ ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
ఎక్కడైనా ప్రమాదం సంభవించినప్పుడు, దానికి గల అసలు కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందేలా పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయం కలిగి ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రత అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి శాఖ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.