మన సమాజంలో దివ్యాంగుల జీవితం ఇంకా నిరంతర పోరాటంగానే సాగుతోంది. గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు ప్రతి చోటా దివ్యాంగులను తక్కువ చూపుతో చూడటం, వారి శారీరక లోపాన్ని ఎగతాళి చేయడం ఒక వ్యవస్థాగత వివక్షగా మారింది. 2016లో పార్లమెంట్ తీసుకొచ్చిన వికలాంగుల హక్కుల చట్టం దివ్యాంగులను కేవలం దయ చూపాల్సిన వర్గంగా కాకుండా, సమాన హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించింది. ఈ చట్టం ప్రకారం వారిని దూషించడం లేదా వివక్ష చూపడం చట్టపరంగా శిక్షార్హమైన నేరం అయినప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో ఈ చట్టం పట్ల సామాన్యుల్లో మరియు అధికారుల్లో భయం కనిపించడం లేదు.
ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగ ఉద్యోగులు మరియు సేవలు కోరి వచ్చే పౌరులు తీవ్రమైన మానసిక వేధింపులకు గురవుతున్నారు. దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, ప్రమోషన్లు లేదా బదిలీల్లో వివక్ష చూపడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. వికలాంగ ఉద్యోగులను పనిభారం పేరుతో వేధించడం కూడా 2016 చట్టం ప్రకారం నేరమే. ఇలాంటి సందర్భాల్లో బాధ్యులైన అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు, జరిమానాలు మరియు జైలు శిక్షలు విధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ, ఆచరణలో ఈ చట్టం అమలు నామమాత్రంగానే ఉండటం గమనార్హం.
దివ్యాంగుల ఆస్తుల రక్షణ విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. వికలాంగుల భూములను అక్రమంగా ఆక్రమించడం, దౌర్జన్యం చేయడం వంటి సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. చట్టం ప్రకారం ప్రభుత్వం దివ్యాంగుల ఆస్తులకు ప్రత్యేక రక్షణ కల్పించి, దోషులకు కఠిన శిక్షలు విధించాలి. దివ్యాంగులను కేవలం సహాయం కోరే వ్యక్తులుగా కాకుండా, హక్కులు కోరే పౌరులుగా గుర్తించినప్పుడే ఈ చట్టానికి పూర్తిస్థాయిలో జీవం పోసుకుంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండటం సమానత్వ సాధనకు అత్యవసరం.