ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సంచలన విషయాలు పంచుకున్నారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ మరియు కాళేశ్వరం అక్రమాలపై ఆయన స్పందిస్తూ.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అయితే అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని తెలిపారు. “కేసీఆర్‌ను జైలుకు పంపాలంటే ఎప్పుడో పంపేవాళ్ళం, కానీ మాకు కక్ష సాధింపు రాజకీయాలు అవసరం లేదు. చట్టం ప్రకారం ఆధారాలు దొరికినప్పుడు ఎవరైనా లోపలికి వెళ్లాల్సిందే” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు:
-
నేనే రాజు.. నేనే మంత్రి: “తెలంగాణలో రాబోయే పదిన్నరేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని. నాకు ఇక్కడ ఎవరూ పోటీ లేరు. నేనే రాజు.. నేనే మంత్రిని” అంటూ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుందని, త్వరలోనే కీలక మలుపులు ఉంటాయని వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇతరుల వ్యక్తిగత విషయాలు వినడం ఒక మానసిక రోగమని ఎద్దేవా చేశారు.
-
జమిలీ ఎన్నికలు: దేశంలో 2029లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.
-
కేంద్రంతో సంబంధాలు: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ హబ్ కోసం హైదరాబాద్ సమీపంలో 500 నుండి 700 ఎకరాల భూమి కేటాయిస్తామని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని కోరుతూనే ఉంటామని తెలిపారు.