మానవ సంబంధాలను మంటగలిపిన దారుణం
సభ్యసమాజం తలదించుకునేలా తన సొంత చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడిన ఒక యువకుడికి విజయవాడ పోక్సో కోర్టు చనిపోయే వరకు జైలు శిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. తల్లిదండ్రుల విడాకుల కారణంగా విడిపోయిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య పెరిగిన దూరం చివరకు ఒక ఘోరానికి దారితీసింది. 2023లో తల్లి వద్ద ఉంటున్న చెల్లిని చూసేందుకు వెళ్లిన సదరు యువకుడు, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు.
నిందితుడి కిరాతకం.. బాధితురాలి ఆవేదన
నిందితుడు తన చెల్లిని తండ్రి దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి విజయవాడలోని ఒక చర్చిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్లి నిరంతరం వేధింపులకు గురిచేశాడు. తీరా గర్భవతి అయిన తర్వాత, గతేడాది ఫిబ్రవరిలో ఆమెను ఒంగోలు బస్టాండులో దింపి తన తండ్రితో కలిసి పరారయ్యాడు. ఇంటికి వెళ్లిన బాలిక అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
కోర్టు కఠిన తీర్పు – ఆర్థిక సాయం
ఈ కేసును తీవ్రంగా పరిగణించిన విజయవాడ పోక్సో కోర్టు, నిందితుడికి జీవితాంతం (చనిపోయే వరకు) జైలు శిక్షతో పాటు 6 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే, బాధితురాలికి నిందితుడు 30 వేల రూపాయలు చెల్లించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.