కోతుల బెడదకు చెక్: చింపాంజీ వేషంలో గ్రామాన్ని కాపాడుతున్న సర్పంచ్

తెలంగాణలోని పల్లెల్లో ప్రస్తుతం కోతుల బెడద ఒక తీవ్రమైన సమస్యగా మారింది. గుంపులు గుంపులుగా జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేయడం, వస్తువులను ఎత్తుకెళ్లడం వంటి పనులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామ సర్పంచ్ మద్దుల రాజిరెడ్డి ఒక వినూత్నమైన అడుగు వేశారు. కోతులను తరిమికొట్టేందుకు ఆయనే స్వయంగా చింపాంజీ వేషం ధరించి వీధుల్లో తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో, కోతుల సమస్యను తీరుస్తానని రాజిరెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత తన మాటను నిలబెట్టుకుంటూ, వినూత్నంగా ఆలోచించి ఈ చింపాంజీ అవతారం ఎత్తారు. సామాన్యంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యాక హోదాను ప్రదర్శించే వారు కనిపిస్తారు, కానీ రాజిరెడ్డి మాత్రం ప్రజా సమస్య పరిష్కారం కోసం సామాన్యుడిలా రంగంలోకి దిగడం విశేషం. ఆయన చింపాంజీ వేషంలో వీధుల్లో తిరుగుతుంటే కోతులు భయపడి పరుగులు తీయడం చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వినూత్న ప్రయత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఆయన చూపిన చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “నిజమైన నాయకుడు అంటే సమస్యను గుర్తించి నేరుగా రంగంలోకి దిగేవాడు” అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇతర గ్రామాల్లోని సర్పంచ్‌లకు కూడా రాజిరెడ్డి ఒక ఆదర్శంగా నిలిచారని స్థానికులు కొనియాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *