మా ఆస్తులు.. మీ ఆస్తులు.. విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌..

తెలంగాణ రాజకీయాల్లో ఆస్తుల వ్యవహారం మరోసారి వేడెక్కింది. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగ సవాల్‌ విసిరారు. తమ కుటుంబ ఆస్తులతో పాటు రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపైనా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ విచారణలో తమ తప్పు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని కేటీఆర్‌ ప్రకటించారు. 

సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి తమ కుటుంబ ఆస్తులపై చేసిన ఆరోపణలకు కేటీఆర్‌ స్పందించారు. వ్యాపారం చేయడం తప్పా? అని ప్రశ్నించారు. తాను 2006లో హోటల్‌ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు. ప్రస్తుతం మూడు హోటళ్లు ఉన్నాయని తెలిపారు. తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించానని పేర్కొన్నారు.

సిరిసిల్లలో చేనేత కార్మికుల సమస్యలను సీఎం పట్టించుకోలేదని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 35 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల పరిహారం ప్రకటిస్తారని ఆశించామని చెప్పారు. అయితే సీఎం తన పర్యటనలో రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తున్నందుకే తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

ఇక హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.