జనసేన ఎమ్మెల్యే సరసాలు.. మరో వీడియో విడుదల చేసిన వీణ..!

రైల్వే కోడూరు నియోజకవర్గ రాజకీయాల్లో వీడియో చాటింగ్ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు వ్యతిరేకంగా ఒక బాధితురాలు వరుసగా వీడియోలను విడుదల చేస్తుండటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఆమె విడుదల చేసిన మరో వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఈ వీడియోలో ఎమ్మెల్యే అత్యున్నతమైన శాసనసభలో ఉండి కూడా సదరు మహిళతో వీడియో కాల్‌ మాట్లాడటం విస్మయానికి గురి చేస్తోంది.

 

అసెంబ్లీ లోపలే వీడియో కాల్..

 

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సమయంలోనే సదరు మహిళకు వీడియో కాల్ చేసినట్లు స్పష్టమవుతోంది. సభ జరుగుతుండగా, ఎమ్మెల్యే తన సీట్లో కూర్చుని మొబైల్ ఫోన్ ద్వారా మహిళతో చాటింగ్ చేస్తూ, ఆమెకు అక్కడ జరుగుతున్న విషయాలను చూపిస్తూ ముసిముసి నవ్వులు చిందించడం వీడియోలో కనిపిస్తోంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సభకు లేదా స్పీకర్ కు చేయాల్సిన ‘నమస్కారాన్ని’ వీడియో కాల్ లో ఉన్న మహిళకు చూపిస్తూ ఎమ్మెల్యే సైగలు చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. చట్ట సభల పట్ల గౌరవం లేకుండా ఇలాంటి ప్రవర్తన ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 

గంటకో వీడియోతో కలకలం..

 

బాధిత మహిళ ఎమ్మెల్యేకు సంబంధించి ‘గంటకో వీడియో’ అన్న చందంగా వరుస ఆధారాలను బయటపెడుతోంది. తమ మధ్య జరిగిన సన్నిహిత సంభాషణలు, వీడియో కాల్ రికార్డింగులను సాక్ష్యాలుగా చూపుతోంది. ఎమ్మెల్యే తనను నమ్మించి వంచించాడని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు పనులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపిస్తోంది. ఇప్పటికే పలు వీడియోలు బయటకు రాగా, ఎమ్మెల్యే ప్రైవేట్ సంభాషణలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వరుస వీడియోల విడుదలతో ఎమ్మెల్యే శ్రీధర్ రక్షణలో పడ్డారు.

 

ఈ వ్యవహారం కేవలం వ్యక్తిగత వివాదంగానే కాకుండా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అసెంబ్లీ లోపల ఫోన్లు వాడటంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే ఇలాంటి పనులకు పాల్పడటం సభా మర్యాదలను ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బాధిత మహిళకు న్యాయం చేయాలని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లేదా ఆయన వర్గీయులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ వీడియోల పరంపర ఎక్కడికి దారితీస్తుందోనని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *