పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా బాధితురాలు ఇంటి వద్దే–C-మిత్ర యాప్‌తో మెదక్‌లో పోలీసుల తొలి FIR నమోదు.

తేది:29-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకు మరింత చేరువగా, స్నేహపూర్వక పోలీసింగ్‌ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన C-మిత్ర యాప్ ద్వారా వృద్ధులు, SC/ST, POCSO కేసుల బాధితులు, దివ్యాంగులకు పోలీస్ సేవలను వారి ఇంటి వద్దకే అందించే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఈ మార్గదర్శకాల ప్రకారం, మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో తొలిసారిగా ఒక చారిత్రాత్మక చర్య చేపట్టారు. మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ డి. మహేష్ గారు దివ్యాంగురాలైన మహిళ నివాసానికి స్వయంగా వెళ్లి, ఆమె ఫిర్యాదును అక్కడికక్కడే నమోదు చేసి FIR కాపీని వెంటనే బాధితురాలికి అందించారు.
ఈ చర్య ద్వారా బాధితురాలి గౌరవం, భద్రత, మానవీయతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పోలీస్ శాఖ విధానాన్ని స్పష్టంగా చూపించారు. పోలీస్ స్టేషన్‌కు రావడం కష్టమైన పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఇది ఎంతో ఊరటనిచ్చే విధంగా ఉండటమే కాకుండా, పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరిచింది.
C-మిత్ర యాప్ ద్వారా ఇంటి వద్దకే సేవలు అందించడం వల్ల ఆలస్యం లేకుండా న్యాయం అందే దిశగా మెదక్ జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *