బీరు కావాలా.. రూ.300 ఇవ్వు. ఫలానా బ్రాండ్ ఫుల్ బాటిల్ అయితే.. రూ.2,500. స్ట్రాంగ్ బీరు అయితే రూ.350 అని బెల్టుషాపుల నిర్వాహకులు ఆఫర్లు ఇస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్ల మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. లాక్‌డౌన్ అమలవుతున్నా.. పల్లెలు, పట్టణాలను మద్యం ముంచెత్తుతోంది. వైన్సులు, బార్లకు మూతపడినా బెల్టు షాపుల్లో జోరుగా లభ్యమవుతోంది. 11 రోజుల నుంచి బయట ఎక్కడా మద్యం అందుబాటులో లేకపోవడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ధరలను మూడింతలు పెంచేశారు. కొన్ని రోజులుగా జిల్లాలో ఏడెనిమిది చోట్ల జరిగిన దాడుల్లో పోలీసులు మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే తప్ప పోలీసులు కదలడం లేదు. స్థానికంగా సివిల్, ఎక్సైజ్ పోలీసుల సహకారంతో ఈ అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 195 మద్యం దుకాణాలు ఉండగా.. అనధికారికంగా ఇంతకు మూడు రెట్లు బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. దాదాపు చిన్న గ్రామాలు, తండాల్లోనూ మద్యం లభిస్తోంది. ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించడంతో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అయితే, అప్పటికే ఎంతో కొంత బెల్టుషాపుల్లో మద్యం నిల్వలు ఉన్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో వైన్స్‌లు, బార్లు మూతపడడంతో బెల్టుషాపుల నిర్వాహకులకు కలిసివచ్చింది. ఎమ్మార్పీపై మూడు రెట్లకు అదనంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా మద్యం లేకపోవడంతో కొందరు పొరుగు జిల్లాల నుంచి గుట్టుగా తీసుకొచ్చి అమ్ముతున్నారు.