కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో క్యాజువాల్టీల్లో విధులు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది భయపడుతున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతరత్రా కరోనా నిరోధక సామగ్రి ఇక్కడ అందుబాటులో లేకపోవడమే వారి భయానికి కారణం. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్ సహా పలు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు రద్దు చేశారు. దీంతో సాధారణ దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు అత్యవసర రోగులు, క్షతగాత్రులు ఆయా ఆస్పత్రుల్లోని క్యాజువాల్టీలకు చేరుకుంటున్నారు. ఒక్కో ఆస్పత్రి క్యాజువాలిటికి రోజుకు సగటున 250 నుంచి 300 మంది రోగులు వస్తున్నారు. ఇలా ఇక్కడికి వచ్చిన బాధితులను ముందుగా జూనియర్ వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ స్టాఫ్ పరీక్షిస్తారు. సమస్య తీవ్రతను బట్టి వారిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, ఆయా విభాగాలకు తరలిస్తుంటారు. ప్రస్తుతం క్యాజువాలిటీలకు సాధారణ రోగులతో పాటు కరోనా బాధితులు కూడా వస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. వారు చనిపోయిన తర్వాత కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ అవుతుండటంతో ఇక్కడ పని చేసేందుకు వైద్యులుభయపడుతున్నారు.