రవికిరణ్.వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రెచ్చిపోదాం బ్రదర్’. ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు నిర్మిస్తున్నారు. జంపన్న మాట్లాడుతూ – ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. మంచి భావోద్వేగాలతో కూడుకున్న వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిస్తున్నాం. సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉంది. సాయి కార్తీక్ సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. ఈ చిత్రంలో పాటలు చాలా ట్రెండీగా, కొత్తగా ఉంటాయి’’ అన్నారు రవికిరణ్. ‘‘ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. యువతను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదంతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు హనీష్ బాబు. దీపాలి శర్మ, శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ తదితరులు ఈ చిత్రంలో నటించారు.