కొవిడ్ అనుమానిత కేసు కనిపించింది… ఎక్కడైనా ఎక్కువ మంది గుమిగూడి ఉన్నారు…ఏదైనా దుకాణంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు…అనారోగ్యానికి గురికావడంతో సహాయం అవసరమైంది… ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటివి ఎదురైనప్పుడు అందరికీ గుర్తుకువచ్చే సంఖ్య ‘100’. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తామో..అదే స్థాయిలో స్పందన ఉండాలని ఆశిస్తాం. అలాంటి విలువైన ‘డయల్–100’కు ప్రస్తుత తరుణంలోనూ ఆకతాయిల బెడద తప్పట్లేదు. అభ్యంతరకరంగా మాట్లాడుతున్న కాలర్లూ ఎక్కువగానే ఉంటున్నారు. సహాయం కోసం కాకుండా కేవలం ‘సమాచారం’ తెలుసుకోవడానికీ అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో డయల్–100కు 21 వేలకు పైగా ఫోన్ కాల్స్ రాగా… వాటిలో 20.7 శాతం న్యూసెన్స్ కాల్స్ కావడం గమనార్హం. ‘డయల్–100’కు రాష్ట్రం నలుమూలల నుంచి సోమ, మంగళవారాల్లో 21,524 కాల్స్ వచ్చాయి. ఇలా వచ్చిన ఫోన్లలో బ్లాంక్ కాల్స్, న్యూసెన్స్ కాల్స్, అనవసరవిషయాలను ప్రస్తావించే ఫోన్ల సంఖ్య 4464గా నమోదైంది. సోషల్‌మీడియా, పోలీసు అధికారిక వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చినా… ఇప్పటికీ ఫలానా అధికారి ఫోన్ నెంబర్ కావాలనో, ఫలానా పోస్టులో ఏ అధికారి ఉన్నారనో తెలుసుకోవడానికి ‘100’ ఫోన్లు చేస్తున్న వారు భారీ సంఖ్యలోనే ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. సోమ, మంగళవారాల్లోనే ఈ తరహా కాల్స్ సంఖ్య 4991గా నమోదైంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న విద్యాధికులు సైతం ఈ తరహాలో ఫోన్లు చేస్తుంటడం సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
ఈ కంట్రోల్ రూమ్‌లో పని చేసే సిబ్బందికి ప్రస్తుత తరుణంలోనూ ‘వేధింపులు’ తప్పట్లేదు. కొందరు ఫోన్లు చేసి పోలీసు విభాగం, సంబంధిత అంశాలతో సంబంధంలేనివి అడుగుతున్నారు. అలాంటి వారికి సిబ్బంది నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే దూషణలకు దిగుతున్నారు. అసభ్యపదజాలం కాకపోయినా… అభ్యంతరకరంగా, ఎదుటి వారి మనస్సుకు బాధ కలిగేలా మాట్లాడుతుంటారు. కొందరు ఆకతాయిలైతే పదేపదే ఫోన్లు చేయడంతో పాటు ఏమీ మాట్లాడకుండా ఉండటమో, వెంటనే కట్ చేసేయడమో చేస్తుంటారు. వీటిని అధికారికంగా బ్లాంక్ కాల్స్‌గా పరిగణిస్తున్న సిబ్బంది పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి నెంబర్లను బ్లాక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ… భవిష్యత్తులో వారికే ఏదైనా ఇబ్బంది ఎదురైనా, అత్యవసరం అయినప్పుడు ఆ వ్యవహారం ‘నాన్న పులి’ కథ మాదిరిగా మారుతుందనే ఉద్దేశంతో ‘డయల్–100’ సిబ్బంది ఉపేక్షిస్తున్నారు.