సాధారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఏప్రిల్ అంటే పెళ్లిళ్ల మాసం. కొద్ది రోజుల క్రితమే క్రికెట్ సీజన్ ముగియడంతో పాటు వాతావరణం మారిపోయి చలిగాలులు పెరగక ముందే పెళ్లి చేసుకునేందుకు వారు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇప్పుడు కోవిడ్–19 కారణంగా ఆ ప్రణాళికలన్నీ తలకిందులవుతున్నాయి. జాతీయ జట్టుకు ఆడుతున్న వారు, బోర్డు కాంట్రాక్ట్ ఉన్నవారిని చూస్తే ఎనిమిది మంది క్రికెటర్లు ఏప్రిల్‌లో పెళ్లికి సిద్ధపడ్డారు. ఆడమ్ జంపా, ఆండ్రూ టై, డార్సీ షార్ట్, స్వెప్సన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కరోనా కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. పెళ్లికి కూడా ఐదుగురుకు మించి హాజరు కారాదు. వధూవరులతో పాటు ఇద్దరు సాక్షులు, పెళ్లి జరిపించే పాస్టర్ మాత్రమే ఉండాలి. దాంతో భారీగా వివాహం తలపెట్టినవారంతా వాయిదాలు వేసుకుంటున్నారు.