ఎక్సైజ్ శాఖ ప్ర‌తిష్ట‌ను పెంచేలా అధికారులు ప‌నిచేయాలి-మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, అబ్కారీ శాఖలో పదోన్నతులు,మంత్రి జూప‌ల్లికి క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన అధికారులు.

తేది:29-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్: అబ్కారీ శాఖ ప్ర‌తిష్ట‌ను పెంచేలా అధికారులు ప‌నిచేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు.
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది.
ఏఈఎస్‌ (AES) స్థాయి నుంచి అడిషనల్‌ కమిషనర్‌ స్థాయి వరకు మొత్తం 53 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి, కృత‌జ్ఞ‌తలు తెలిపారు.
చాలా కాలంగా ఎదురు చూస్తున్న త‌మ‌కు పార‌ద‌ర్శ‌కంగా ప‌దోన్న‌తులు క‌ల్పించినందుకు ద‌న్య‌వాదాలు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదోన్నతులు పొందిన అధికారులు మరింత ఉత్సాహంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు.
క‌ల్తీ, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా కేసులను దర్యాప్తుచేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు.
నిఘా వ్యవస్థను బలోపేతం చేసి గంజాయి, క‌ల్తీ క‌ల్లు తయారీ, అక్రమ మద్యం రవాణాను అరికట్టాలని, ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ దిశగా ఎక్సైజ్ శాఖ నిరంతరం చర్యలు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.
మంత్రిని కలిసిన వారిలో అడిషనల్‌ కమిషనర్లు ఎస్‌.వై. ఖురేషి, సురేష్‌ రాథోడ్, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు జె. హరికిషన్, చంద్ర‌య్య‌, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లు డి. శ్రీనివాస్, ప్రదీప్‌రావు, జ్యోతికిరణ్‌, పంచాక్షరి, ఆర్.కిషన్‌తో పాటు ఈఎస్‌లు ఏ.కిష‌న్, తుక్యా నాయక్, జీవన్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *