నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ..! వాటిపై చర్చ..!

ఢిల్లీలో జరిగిన చింతన్ శివిర్ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న ప్రయాణ అవసరాలు, మౌలిక వసతుల కల్పనపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని వివరించిన మంత్రి, కీలక ప్రాజెక్టులకు కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో నిత్యం తీవ్ర ట్రాఫిక్‌‌తో అల్లాడిపోయే ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ మార్గంలో డబుల్‌ డెక్కర్‌‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను వెంటనే మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు విజయవాడ వైపు వెళ్లే ప్రధాన రహదారి అయిన NH-65ను 6+2 లేన్లుగా విస్తరించాల్సిన అత్యవసరాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ భాగాల పనులను వేగవంతం చేయడంతో పాటు, ప్రతిపాదిత హైదరాబాద్‌–అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంపై కూడా ప్రాథమికంగా చర్చించారు.

పర్యాటకం, భక్తుల సౌకర్యార్థం పర్వతమాల పథకం కింద రాష్ట్రంలో 5 రోప్‌వేలను మంజూరు చేయాలని కోరారు. అలాగే CRIF కింద 33 రహదారి అభివృద్ధి పనులతో పాటు, రైల్వే దాటులకు ఇబ్బంది లేకుండా 3 ఆర్‌ఓబీ/ఆర్‌యూబీ లకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్లే హైదరాబాద్‌–శ్రీశైలం NH-765పై పర్యావరణానికి హాని కలగకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలనే ప్రత్యేక ప్రతిపాదనను గడ్కరీ ముందు ఉంచారు.

మంత్రి కోమటిరెడ్డి అందించిన ప్రతిపాదనల పట్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన రహదారి ప్రాజెక్టుల పరిశీలనకు కేంద్రం నుండి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.