

తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖకు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించడం జగిత్యాల వైద్య వర్గానికి గర్వకారణంగా నిలిచింది. శనివారం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించిన ఐఎంఏ జాతీయ స్థాయి సదస్సులో, ఐఎంఏ జగిత్యాల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ కార్యదర్శి గా ఎంపికైన సందర్భంగా, ప్రతిష్ఠాత్మక ఐఎంఏ జాతీయ అధ్యక్షుల ప్రశంసా పురస్కారంను అందుకున్నారు.
ఈ విషయాన్ని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ గుడూరి హేమంత్ గారు తెలియజేశారు. గత ఒక సంవత్సరం కాలంగా ఐఎంఏ జగిత్యాల ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి గారు అత్యంత క్రియాశీలకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, శాఖ సభ్యులందరినీ సమన్వయం చేసుకుని అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు ఈ పురస్కారం లభించిందని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ జగిత్యాలలో రక్తదాన శిబిరాలు, హెచ్‌పివి వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు, రక్తహీనత నివారణ కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, వైద్యుల కోసం నిర్వహించిన శాస్త్రీయ సమ్మేళనాలతో పాటు ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించే పలు కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించబడిన విషయాన్ని ఐఎంఏ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కు, ఐఎంఏ జగిత్యాల శాఖ సభ్యులందరికీ, మీడియా ప్రతినిధులకు మరియు ఈ కార్యక్రమాల విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఐఎంఏ జగిత్యాల శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ జాతీయ స్థాయి పురస్కారం జగిత్యాల ఐఎంఏ శాఖ సేవా కార్యక్రమాలకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుందని, భవిష్యత్తులో కూడా వైద్యుల సంక్షేమం మరియు ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని శాఖ నాయకత్వం స్పష్టం చేసింది.