
తేదీ:27-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా త్వరలో పటాన్చెరు కేంద్రంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శనివారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక రంగానికి వెన్నుముకగా నిలుస్తున్న కార్మిక రంగానికి వెన్నుపోటు పొడుస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా నూతనంగా నాలుగు కార్మిక చట్టాలను తీసుకొని రావడం దుర్మార్గం అన్నారు.ప్రధానంగా పారిశ్రామిక సంబంధాల కోడ్‌లోని నిబంధనల వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, పెద్దసంస్థల్లో కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులను తొలగించే అవకాశం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.పని గంటలను పెంచే అవకాశం ఉండడం వల్ల కార్మికుల ఆరోగ్యం, కుటుంబ జీవితం ప్రభావితమవుతుందని తెలిపారు.వచ్చే సంవత్సరం నుండి నుంచి దేశవ్యాప్తంగా కార్మికులపై బలవంతంగా రుద్దుతున్న లేబర్ కోడ్‌లు ప్రస్తుత 29 కార్మిక చట్టాల ద్వారా పొందుతున్న కనీస హక్కులను రద్దు కాబోతున్నాయని అన్నారు. న్యాయస్థానాల ద్వారా పొందే హక్కును సైతం నూతన లేబర్ కోడ్స్ నిరాకరిస్తున్నాయని అన్నారు.పాత కార్మిక చట్టాల్లో కనీస వేతనం నిర్ణయించే అంశం కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి అంశంగా ఉందని..నూతన లేబర్ కోడ్‌లలో రాష్ట్రాల హక్కులు తొలగించడం బాధాకరమన్నారు. ఇక నుండి కేంద్రం కనీస వేతనాలు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న వేతనాలు ఇకపై కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా చెందిన పటాన్చెరు నియోజకవర్గంలో నూతన చట్టాలు కార్మికుల పాలిట ఆశనిపాతంగా మారబోతున్నాయని అన్నారు.
నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్చెరులో నిర్వహించబోయే భారీ నిరసన సభ విజయవంతానికి ప్రతి కార్మికుడు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు.