పటాన్‌చెరు జాతీయ రహదారి పనుల్లో నాసిరకం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంట్రాక్టర్.

తేదీ:27-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.

సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు పట్టణ పరిధిలో మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి మూడు లైన్ల విస్తరణ పనుల్లో తీవ్రమైన నాసిరకం పనులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు,MDR ఫౌండేషన్ కో–ఫౌండర్,మాద్రి పృథ్విరాజ్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ రహదారి నిర్మాణ పనులను చేపడుతున్న RKC బిల్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంట్రాక్టర్,గతంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లేవనెత్తిన సూచనలు,హెచ్చరికలను పూర్తిగా పట్టించుకోకుండా మళ్లీ అదే అలసత్వంతో నాసిరకం పనులు కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. శ్రీరామ్ నగర్ కాలనీ సమీపంలో రహదారి పక్కన వర్షపు నీటి పారుదల కోసం నిర్మించిన కాలువపై వేసిన స్లాబు కేవలం సుమారు 4అంగుళాల మందంతో ఉన్న కూడా, ఒక చిన్న వాహనం వెళ్లగానే కూలిపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది కేవలం నిర్మాణ లోపమే కాకుండా, ప్రజల ప్రాణాలకు నేరుగా ముప్పు కలిగించే ప్రమాదకర పరిస్థితి అని తెలిపారు.
భారత జాతీయ రహదారి అథారిటీ నిబంధనల ప్రకారం
డ్రైనేజ్ స్లాబులు నిర్దిష్ట లోడ్ కెపాసిటీతో తగిన మందం, నాణ్యత ప్రమాణాలతో టెక్నికల్ ఇన్స్పెక్షన్ అనంతరం మాత్రమే నిర్మించాల్సి ఉండగా,ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ పనులు చేయడం అత్యంత ఆందోళనకరమని మాద్రి పృథ్విరాజ్ తెలిపారు.ఈ ఘటనను గమనించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి,అక్కడ ఉన్న ఇన్‌చార్జ్ అమోల్ ను ప్రశ్నించారు.ఇలాంటి నాసిరకం పనుల వల్ల ప్రజల ప్రాణాలు పోవడం ఖాయమని అన్నారు.వెంటనే లోపాలను సరిదిద్దకపోతే ప్రజా వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. అవసరమైతే పనులు నిలిపివేసి,పట్టణ ప్రజలమంతా కలిసి ధర్నా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.జాతీయ రహదారి వంటి అత్యంత కీలక మౌలిక వసతుల నిర్మాణంలో కాంట్రాక్టర్ అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని,నాణ్యత ప్రమాణాలు పాటించే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని మాద్రి పృథ్విరాజ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *