

తేది:27-12-2025 TSLAWS మెదక్ జిల్లా మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా : రెండు సంవత్సరాల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేయడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన జీ.ఓ నెంబర్ 252 పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని టియూడబ్ల్యూజే (హెచ్ 143) ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు తీవ్రంగా విమర్శించారు.
యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం మెదక్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించి, డీఆర్వో భుజంగ రావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టియూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు జానకిరామ్ గౌడ్, జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కొత్త జీ.ఓ జర్నలిస్టుల కనీస హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పనిచేసిన జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, 2014లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన జర్నలిస్టు జాతరలో అప్పటి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించారని తెలిపారు. ఆ హామీ మేరకు అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దేశంలో ఎక్కడా లేని విధంగా 23 వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం మీడియా అక్రిడిటేషన్ కార్డు, మీడియా కార్డు అంటూ రెండు రకాల కార్డులు ప్రవేశపెట్టి గందరగోళం సృష్టించారని, ఏ కార్డు వల్ల ఏ ప్రయోజనం కలుగుతుందో కూడా జీ.ఓలో స్పష్టత లేదని విమర్శించారు. రిపోర్టర్లకు, డెస్క్ జర్నలిస్టులకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం శోచనీయమన్నారు.
కేబుల్ ఛానళ్లకు గతంలో ఇచ్చిన అక్రెడిటేషన్లను పూర్తిగా తొలగించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. అలాగే మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్డుల కోత వల్ల పార్ట్‌టైమ్ రిపోర్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులకు అనుభవ అర్హతను 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు పెంచడం కూడా అన్యాయమని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మెజార్టీ జర్నలిస్టులు వ్యతిరేకిస్తున్న జీ.ఓ 252ను వెంటనే పునఃపరిశీలించి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు అందేలా సవరించిన నూతన జీ.ఓ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాజ్యాంగబద్ధంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే (హెచ్ 143) సీనియర్ నాయకులు గోపాల్ గౌడ్, సంగమేశ్వర్, గోవర్ధన్ రెడ్డి, రహమద్, రాఘవులు,తోట అభిలాష్,యాదగిరి, కార్తీక్, సోని రాజు, గిరి, శ్రీనివాస్, ఉషయ్య, శేఖర్ గౌడ్, హమీద్, ఆంజనేయులు, రవి, వంశీ, చంద్రశేఖర్, అరవింద్, జయరాజ్, యూసుఫ్, ఇంతియాజ్ అబ్రహం, రాణి, కే.వేణుగోపాల్, జి.భాస్కర్ గౌడ్, పెద్దిగారి నగేష్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.