బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి రచించిన ‘రండి.. దీపాలు వెలిగిద్దాం’ అనే ప్రఖ్యాత కవిత వీడియో క్లిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే వాజ్‌పేయి కవితను మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో క్లిప్‌లో ఓ వేదికపై వాజ్‌పేయి తన కవితను చదువుతూ కనిపించారు.
వైద్య పరికరాల కొరత లేకుండా చూడాలి
కరోనా వైరస్ బాధితులకు, వారికి వైద్య సేవలందించే డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి, సాధారణ ప్రజలకు సరిపడా నిత్యావసర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మాస్కులు, గ్లౌజ్‌లు, వెంటిలేటర్ల కొరత లేకుండా చూడాలన్నారు. కరోనా నియంత్రణ చర్యల సన్నద్ధత కోసం ఏర్పాటు చేసిన 11 సాధికార బృందాలతో, సంబంధిత అధికారులతో ప్రధాని మోదీ శనివారం సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా బాధితులకు అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, ఐసోలేషన్, క్వారంటైన్ సౌకర్యాలపై ఆరా తీశారు. కరోనా టెస్టింగ్, క్రిటికల్ కేర్ ట్రైనింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. రక్షణ పరికరాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు.