ఎలక్ట్రానిక్ పంట నమోదు (ఇ–క్రాప్ బుకింగ్) ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇ–పంట విధానంతో రైతుల ఇళ్ల ముంగిటే సేవలందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇ–క్రాప్ డేటాతో ధాన్యాన్ని సేకరించడం ఇదే తొలిసారి.
విధివిధానాలు ఇలా ఉన్నాయి…
► ఇ–క్రాప్ బుకింగ్‌లో ఆయా గ్రామాల్లోని రైతులు ఏఏ పంటలు వేశారో ఇప్పటికే నమోదు అయింది.
► వరి పంట వేసిన రైతులు తమ గ్రామ స్థాయిలోనే ధాన్యం అమ్మకానికి పేర్లను నమోదు చేయించుకోవాలి.
► గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకులు కొనుగోలు కేంద్రం తరఫున రైతుల పేర్లను నమోదు చేస్తారు. వేరే గ్రామం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న ఊళ్లోనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. రబీ డేటా ఆధారంగా కొనుగోళ్లు చేపడతారు.
► ప్రస్తుత ఇ–క్రాప్ బుకింగ్ విధానంలో వ్యవసాయ సహాయకులు సర్వే నంబర్ వారీగా తనిఖీ చేసి సాగుదార్ల వివరాలను నమోదు చేసినందున కొనుగోళ్లు సుళువవుతాయి. ఇ–క్రాప్ బుకింగ్ డేటాను పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శిస్తారు. ఏవైనా ఫిర్యాదులు, అభ్యర్థనలు వస్తే పరిశీలించి అర్హత కలిగిన వారిని కూడా ఇ–క్రాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
► వెబ్‌ల్యాండ్‌లో లేని భూములను కూడా పరిశీలించి వాటిలో వరి సాగు చేసి ఉంటే ఆ రైతుల వివరాలను కూడా ఇ–క్రాప్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల ధాన్యం కొనుగోళ్ల కార్యక్రమం సాఫీగా సాగుతుందని భావిస్తున్నారు. ఇదే ప్రక్రియను మొక్కజొన్న కొనుగోళ్లకు కూడా వినియోగించనున్నారు. ఈ విధానాన్ని శనగలకు అమలు చేసి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది.