‘‘ప్రస్తుతం అందరం ఎదుర్కొంటున్న సమస్య కరోనా. కానీ ప్రజల్లో ఐకమత్యం కనిపించడంలేదు. ఐకమత్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యని అయినా ఎదుర్కోగలం’’ అంటున్నారు శ్రుతీహాసన్. లాక్ డౌన్ సమయాల్లో ఇంటి పట్టునే ఉంటూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారామె. వర్కౌట్స్, మేకప్ టిప్స్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుత సమయాల్లో కావాల్సింది ప్రేమ, దయ అన్నారు. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘కొన్ని వార్తలు వింటుంటే చాలా దారుణం అనిపిస్తోంది.
కొందరు వ్యక్తులు మానవత్వం మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సమయాల్లోనూ వివక్ష చూపిస్తున్నారు అంటే మనుషులు ఎలా ఉన్నారో అర్థం అవుతోంది. కానీ వైరస్‌కి అలాంటి వివక్ష ఏమీ ఉండదు. అందర్నీ సమానంగా దాడి చేస్తుంది. దాన్ని ఎదుర్కోవాలంటే ఒకరి మీద ఒకరు ప్రేమ, దయను చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య కూడా మనల్ని ఏకం చేయకపోతే ఇంకేం ఏకం చేస్తుందో దేవుడికే తెలియాలి’’ అన్నారామె.