హాకీ ఇండియా (హెచ్‌ఐ) మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే కేంద్రానికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన హెచ్‌ఐ శనివారం అదనంగా మరో రూ. 75 లక్షలు పీఎం–కేర్స్ సహాయనిధికి ప్రకటించింది. దీంతో హెచ్‌ఐ మొత్తం కోటి రూపాయల విరాళమిచ్చినట్లయింది. ప్రస్తుత పరిస్థితులరీత్యా ప్రభుత్వానికి మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు హెచ్‌ఐ తెలిపింది. ‘దేశంలో సంక్షోభం ముదురుతోన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ చేదోడుగా నిలవాలి. కరోనాను అరికట్టేందుకు కేంద్రం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఇన్నాళ్లుగా దేశ ప్రజల నుంచి హాకీ అమితమైన ప్రేమ, ఆదరణను పొందింది. ఇది దేశానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు.