‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై శివాజీ స్పందిస్తూ, ఆవేశంలో దొర్లిన రెండు అసభ్య పదాలకు గానూ తన తోటి నటీనటులకు, మహిళలకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. కార్యక్రమం ముగిసి బయటకు రాగానే తాను చేసిన తప్పును గ్రహించానని, ఆ బాధతో గత 36 గంటలుగా నిద్రపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో కూడా ఎన్నడూ హద్దు మీరి మాట్లాడలేదని, ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానో అని బాధపడ్డానని పేర్కొన్నారు.
అయితే, హీరోయిన్లు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు సంప్రదాయబద్ధంగా ఉండాలన్న తన అభిప్రాయానికి మాత్రం కట్టుబడి ఉన్నానని శివాజీ స్పష్టం చేశారు. గతంలో లులు మాల్ ఈవెంట్‌లో నటి నిధి అగర్వాల్ ఎదుర్కొన్న అసౌకర్య పరిస్థితిని చూసి, హీరోయిన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆవేదనతోనే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. సినిమాల వల్ల సమాజం నాశనమవుతోందన్న విమర్శలు రాకూడదన్నదే తన ఉద్దేశమని, ఒకప్పుడు రమ్యకృష్ణ, విజయశాంతి వంటి వారు కట్టుకున్న చీరలు మహిళలకు స్ఫూర్తిగా నిలిచేవని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం తాను నటించిన ‘దండోరా’ సినిమా సమాజంలోని కుల వ్యవస్థను ప్రశ్నించే విధంగా ఉంటుందని, ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరారు. తన ప్రవర్తన వల్ల సినిమాకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే బాధ్యతగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలకు తన మాటల వల్ల మనస్తాపం కలిగి ఉంటే మన్నించాలని, కానీ సంస్కృతిని కాపాడుకోవాలన్న తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన విన్నవించారు.