కల్వకుంట్ల కవిత తన రాజకీయ అస్తిత్వంపై స్పష్టతనిస్తూ.. తాను తెలంగాణ ప్రజలు వదిలిన బాణాన్ని అని, తనను ఎవరూ ఆదేశించలేరని ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని పొరపాట్లలో తాను కూడా భాగస్వామినేనని ఆమె బహిరంగంగా అంగీకరించారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో ఆలేరు ప్రాంత రైతులపై బేడీలు వేసిన ఘటన తనను కలిచివేసిందని, ఆ ‘పాపం’లో భాగమున్నందుకు ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. తనను కేవలం నిజామాబాద్‌కే పరిమితం చేయడం వల్ల రాష్ట్రంలోని ఇతర సమస్యలను పట్టించుకోలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం కారణం కూడా చెప్పకుండా తనను పార్టీ నుంచి తొలగించారని, ఉరివేసే వ్యక్తికి కూడా కారణం చెబుతారని ఆమె ఎద్దేవా చేశారు. పార్టీతో సంబంధం లేకుండా గత 19 ఏళ్లుగా ‘తెలంగాణ జాగృతి’ ద్వారా ప్రజల్లోనే ఉన్నానని, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటానని తన రాజకీయ భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేశారు. తన తదుపరి పోరాటం కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనని స్పష్టం చేశారు.
ప్రాంతీయ సమస్యలపై స్పందిస్తూ, రీజనల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టులో భారీ అవినీతి జరుగుతోందని, పెద్దల కోసం అలైన్మెంట్లను మారుస్తూ పేదల భూములను బలిపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై జనవరి 5న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఆర్ఎస్ఎస్ సీఎం’ అని, ఆయన బీజేపీతో అంతర్గతంగా కుమ్మక్కయ్యారని విమర్శించారు. భువనగిరి ఎయిమ్స్ (AIIMS) నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, స్థానికులకే 80% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కవిత హెచ్చరించారు.