

తేదీ: 24-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
అమీన్పూర్ : క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు జీవంత ప్రతీక అని అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని 70 చర్చీలకు, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ కేకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి దారి చూపే దీపస్తంభంలాంటివని అన్నారు. ప్రేమతో జీవించడం, క్షమాభావంతో ముందుకు సాగడం, అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం వంటి విలువలు క్రిస్మస్ పండుగ ద్వారా మనకు గుర్తుకు వస్తాయని తెలిపారు. పరస్పర సహకారం, సహనం, సోదరభావంతో జీవించడమే ఈ పవిత్ర పండుగ అసలైన సందేశమని పేర్కొన్నారు.
అమీన్పూర్ జీహెచ్ఎంసీగా ఏర్పడ్డ అనంతరం మొదటి పండుగగా క్రిస్మస్ రావడం ప్రత్యేక ఆనందాన్ని కలిగించిందని, ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 70 చర్చీలకు ఫాస్టర్ల ద్వారా కేకులను పంపిణీ చేయడం హృదయాన్ని తాకిందన్నారు. క్రైస్తవ సోదరులు ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మున్నా, మన్నే రవీందర్, మహేష్, ప్రవీణ్ ఈశ్వర్ రెడ్డి, చుక్కా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ యాదవ్, శ్రీధర్, కృష్ణ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, చర్చిల ఫాస్టర్లు పాల్గొన్నారు.