వైద్య వృత్తికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుత సంఘటన కేరళలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఓ బాధితుడిని చూసి ముగ్గురు వైద్యులు చలించిపోయారు. ఎర్నాకుళంకు చెందిన డాక్టర్ థామస్ పీటర్, ఆయన భార్య డాక్టర్ దిడియా థామస్ మరియు కోటయం మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ మనూప్.. ఆంబులెన్స్ వచ్చే వరకు వేచి చూస్తే బాధితుడు మరణించే ప్రమాదం ఉందని గ్రహించారు. దీంతో ఎలాంటి వైద్య పరికరాలు లేకపోయినా, నడిరోడ్డునే ఆపరేషన్ థియేటర్‌గా మార్చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక ప్రజలు మరియు పోలీసుల సహకారంతో, మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులోనే ఆ ముగ్గురు వైద్యులు బాధితుడికి అత్యవసర శస్త్రచికిత్స ప్రారంభించారు. ఆపరేషన్ థియేటర్, అత్యాధునిక సౌకర్యాలు లేని ఆ క్లిష్ట పరిస్థితుల్లో కేవలం నాలుగు నిమిషాల్లోనే ఆ ప్రక్రియను పూర్తి చేసి, బాధితుడిని మృత్యుఒడి నుంచి ప్రాణాలతో బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితుడి పరిస్థితి నిలకడగా మారడంతో, మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఈ గుండెలను హత్తుకునే ఘటనను కేరళ ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది. ఆపద సమయంలో వృత్తి ధర్మాన్ని పాటించి ఒక ప్రాణానికి పునర్జన్మ ప్రసాదించిన ఆ వైద్య దంపతులను మరియు డాక్టర్ మనూప్‌ను నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. “నిజమైన దేవుళ్లు అంటే వీరే” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆపదలో ధైర్యం వీడకుండా వైద్యులు చేసిన ఈ సాహసానికి యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.