భద్రతా హామీలు ఇస్తే నాటోలో చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకుంటాం: జెలెన్‌స్కీ కీలక ప్రకటన

నాలుగు సంవత్సరాలుగా ఎడతెగకుండా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆదివారం బెర్లిన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగకుండా పశ్చిమదేశాల నుంచి భద్రతా హామీలు లభిస్తే, తమ దేశం నాటో కూటమిలో చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకోవడానికి సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు.

నాటో సభ్య దేశాలకు ఉన్న తరహాలోనే భద్రతా హామీలను పశ్చిమదేశాలు తమకు అందించాలని జెలెన్‌స్కీ కోరారు. “ఈ భద్రతా హామీలు రష్యా నుంచి మరో దాడిని నిరోధించేందుకు ఒక అవకాశం. ఇది మా వైపు నుంచి చేస్తున్న రాజీ” అని ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఇటీవల ట్రంప్ విధించిన 20 సూత్రాల ఒప్పంద ప్రణాళికను ఉక్రెయిన్ అంగీకరించనప్పటికీ, ఈ భద్రతా హామీల ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం గమనార్హం.

మరోవైపు, రష్యాకు తమ భూభాగాన్ని అప్పగించాలనే అమెరికా ప్రతిపాదనను జెలెన్‌స్కీ పూర్తిగా తిరస్కరించారు. తూర్పు ప్రాంతంలోని డొనెట్స్ నుంచి ఉక్రెయిన్ బలగాలను ఉపసంహరించుకుని, అక్కడ సైన్యం లేని స్వేచ్ఛా ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆచరణ సాధ్యం కాదని కొట్టిపారేశారు. తాత్కాలికంగా సరిహద్దు వెంబడి బఫర్ జోన్ ఏర్పాటు చేస్తే, ఉక్రెయిన్ దళాలు వెనక్కి తగ్గినట్లే, రష్యా దళాలు కూడా అదే దూరం వెనక్కి ఎందుకు తగ్గకూడదు? అని జెలెన్‌స్కీ ప్రశ్నించారు. ఈ డొనెట్స్ ప్రాంతంలో రష్యా పోలీసు, నేషనల్ గార్డ్ దళాలు ఉంటాయని రష్యా ఇప్పటికే స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *