వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా: 10 రోజులు హోమం టికెట్లు రద్దు చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కారణంగా, ఆ పది రోజుల పాటు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తిరుపతిలోని అలిపిరి వద్ద నిర్వహించే ఈ హోమం టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. హోమం టికెట్లను రద్దు చేయడంతో పాటు, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా (ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా) రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యలన్నీ ఆ పది రోజులు సామాన్య భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా మెరుగైన దర్శనం కల్పించడం కోసం ఉద్దేశించబడ్డాయి. భక్తులు తమ ప్రణాళికలను అందుకు అనుగుణంగా మార్చుకోవాలని టీటీడీ కోరింది.

మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన భక్తుడు రూ.10 లక్షల విరాళంగా సమర్పించారు. డార్లింగ్ క్లాసిక్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ సంస్థ డైరెక్టర్ మురళి వెంకటసుబ్బు ఈ విరాళానికి సంబంధించిన డీడీని బుధవారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతికి అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *