రేవంత్ రెడ్డితో గ్యాప్ లేదు: మంత్రి పదవిపై ఆరాటం లేదన్న మహేశ్ గౌడ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, తామిద్దరం పూర్తి సమన్వయంతోనే పనిచేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి పదవిపై తాను ఆరాటపడటం లేదని, పీసీసీ అధ్యక్షుడిగానే ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తనకు పూర్తి సహకారం అందిస్తున్నారని, మంత్రి పదవి కావాలని తాను ఎప్పుడూ అడగలేదని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మహేశ్ గౌడ్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం తమకు కలిసి వచ్చిందన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలు రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ బాగా పెరిగిందని, మరో పదేళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

డీసీసీ అధ్యక్షుల నియామకంపై పార్టీ అధిష్ఠానం కసరత్తు పూర్తి చేసిందని, ఏ క్షణంలోనైనా జాబితా వెలువడవచ్చని ఆయన వెల్లడించారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు ఆదేశాల ప్రకారమే నిర్వహిస్తామని మహేశ్ గౌడ్ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *