ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో నిర్ఘాంతపడే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి వెనుక భారీ ఉగ్ర కుట్ర ఉందని, గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరపాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే, అక్కడ భారీ బందోబస్తు ఉండటంతో, ఆ తర్వాత డిసెంబరు 6వ తేదీన (బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం) ఎర్రకోట సమీపంలోనే పెద్ద దాడికి పాల్పడాలని కుట్ర జరిగినట్లు కూడా విచారణలో తేలింది.
ఈ దాడి వెనుక టర్కీ, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్లు ఉన్నారని ప్రాథమికంగా తెలిసింది. ఈ ఉగ్ర మాడ్యూల్‌కు నిషేధిత జైష్-ఇ-మహమ్మద్ (JeM)తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ గ్రూపులోని సభ్యులు అధిక విద్యావంతులు కావడం గమనార్హం. పేలుడు కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ అసలు డిసెంబర్ 6న పెద్ద దాడి చేయాలని భావించినప్పటికీ, అతని సహచరుడు డాక్టర్ ముజమ్మిల్ గనయీ అరెస్ట్ కావడంతో ఈ పథకం విఫలమైందని అధికారులు తెలిపారు. గనయీ గదిలో 360 కిలోల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్న తర్వాత నబీ గందరగోళానికి లోనై కారులోనే పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఉగ్రదాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ గనయీలతో సహా ఈ గ్రూపు సభ్యులు జనవరిలో ఎర్రకోట పరిసరాల్లో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ డేటా ద్వారా ధృవీకరించారు. వీరిద్దరూ 2021లో టర్కీకి వెళ్లిన సమయంలోనే తీవ్రవాద భావాలకు ఆకర్షితులయ్యారని, అక్కడ జైష్ హ్యాండ్లర్ ఉమర్ బిన్ ఖత్తాబ్ ఆధ్వర్యంలోని టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 26/11 తరహా దాడులకు సిద్ధమవ్వాలని ఆదేశాలు అందుకున్నారని చెబుతున్నారు. ఎర్రకోటతో పాటు అయోధ్యలో కూడా పేలుళ్లు జరపాలని ముష్కరులు ప్లాన్ చేసినట్లు సమాచారం.