వివిధ ప్రాజెక్టులు, పనులకు సంబంధించి జీహెచ్‌ఎంసీలో పెండింగ్‌

వివిధ ప్రాజెక్టులు, పనులకు సంబంధించి జీహెచ్‌ఎంసీలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు. నెలల తరబడి పైసా చెల్లించకపోవడంతో ఇప్పటికే కొన్ని పనులు నిలిచిపోగా.. మరి కొన్ని ప్రాజెక్టుల పరిస్థితీ అలానే ఉంది. బిల్లులిస్తే కానీ పనులు చేయమని గతంలోనే కాంట్రాక్టర్లు అల్టిమేటం జారీ చేశారు. బుధవారం ఉప్పల్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద బిల్లుల చెల్లింపులో జాప్యంపై నిరసన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పు కంటే వడ్డీ అధికమవుతోందని, ఆస్తులు అమ్మినా చెల్లించే పరిస్థితి లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. తాహతుకు మించి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతనెత్తుకున్న జీహెచ్‌ఎంసీని కొన్నేళ్లుగా ఆర్థికంగా ఇబ్బందులు చుట్టుముట్టాయి.
ప్రస్తుతం రోజుకు రూ. కోటి చొప్పున వడ్డీ చెల్లిస్తోన్న బల్దియా.. మున్ముందు అసలు, వడ్డీ కలిపి నిత్యం రూ.3 కోట్లకుపైనే చెల్లించాల్సి రానుంది. కరోనా అనంతర పరిణామాల నేపథ్యంలో కొంత కాలంగా సంస్థకు రోజూ రూ.2-3 కోట్ల ఆదాయం కూడా రావడం లేదు. పరిస్థితి ఇలానే ఉంటే పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, ప్రాజెక్టుల పనులు కాదు.. వేతనాలు ఇవ్వడమూ కష్టమే. నిధుల విషయాన్ని మాకొది లేయ్యండని చెప్పిన సర్కారు.. ప్రాజెక్టులు ప్రారంభించిన అనంతరం పైసా విదల్చడం లేదు. అప్పులు చేసి నిధులు సమకూర్చుకోవాలని ఆదేశించింది. బ్యాంకులు, ఇతర సంస్థల వద్ద తీసుకుంటోన్న రుణాలకు కనీసం గ్యారంటీ ఉండేందుకూ ముందుకు రావడం లేదు.

రోడ్ల నిర్వహణ బకాయి రూ.900 కోట్లు…

గ్రేటర్‌లో రహదారుల నిర్మాణం, నిర్వహణ పనులకు సంబంధించి ప్రస్తుతం రూ.900 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. జనవరి 29వ తేదీ అనంతరం మెయింటెనెన్స్‌ పనుల బిల్లులు చెల్లించలేదని ఓ అధికారి చెప్పారు. గత ఆరు నెలలుగా రోడ్ల నిర్మాణం, మరమ్మతు, నాలాల పూడికతీత, ఫుట్‌పాత్‌ల నిర్మాణం తదితర పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31వ తేదీ వరకు సమర్పించిన బిల్లులు రూ.550 కోట్ల వరకు ఉన్నాయని, ఒక్క మార్చిలోనే రూ.300 కోట్ల బిల్లులు వచ్చాయని ఇంజనీరింగ్‌ అధికారి తెలిపారు.

గత మూడు నెలల్లో మరో రూ.350 కోట్ల పనులు జరిగాయి. ఖజానాలో నిధులు లేకపోవడం వల్లే చెల్లింపులు నిలిపివేశామని ఆర్థిక విభాగం అధికారొకరు తెలిపారు. రెండు పడకల ఇళ్లకు సంబంధించి రూ.600 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. లక్ష ఇళ్లకుగాను 80 వేల ఇళ్ల పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. బిల్లులు రాకపోవడంతో కొన్నాళ్లుగా మెజార్టీ సైట్లలో పనులు జరగడం లేదు. రెండు పడకల ఇళ్లకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నుంచి వచ్చే నిధుల నుంచి బిల్లులు చెల్లిస్తున్నారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుల బిల్లులు రూ.70 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం రూపీ టర్మ్‌లో రుణంగా తీసుకున్న రూ.2500 కోట్లలో ఇప్పటికే రూ.1600 కోట్లకుపైగా ఖర్చయ్యాయి.

సీఆర్‌ఎంపీ బిల్లులు ఎప్పటికప్పుడు…

గ్రేటర్‌లోని ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను సీఆర్‌ఎంపీలో భాగంగా ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించారు. ఐదేళ్ల కాలవ్యవధితో 709 కి.మీల రోడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.1839 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందుకోసం రూ.1460 కోట్ల రుణం తీసుకుంది జీహెచ్‌ఎంసీ. వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న కాంట్రాక్టు సంస్థలు ఈ పనులు దక్కించుకున్నాయి. సీఆర్‌ఎంపీ పనులకు సంబంధించిన బిల్లులు మాత్రం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.450 కోట్ల చెల్లింపులు జరిగాయని ఇంజనీరింగ్‌ విభాగం అధికారొకరు చెప్పారు. రూ.లక్షలు, ఐదు, పది కోట్ల టర్నోవర్‌ ఉన్న కాంట్రాక్టు సంస్థలకు నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంపై కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇప్పట్లో బకాయి బిల్లులు చెల్లించడం దాదాపు అసాధ్యం. ఆస్తి పన్ను, నిర్మాణ అనుమతుల రుసుములు వేతనాలకే చాలడం లేదు. ప్రభుత్వం నిధులిస్తే తప్ప పెండింగ్‌ బిల్లులు చెల్లించలేం’ అని ఆర్థిక విభాగం వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *