చైనా ఇతర దేశాలను దెబ్బతీసేందుకు అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రత్యక్ష యుద్ధానికి బదులుగా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడం, సైబర్ దాడులు చేయడం, రాజకీయ దుష్ప్రచారాలు చేయడం వంటి పద్ధతులను అనుసరిస్తోంది. ఇటువంటి విధానాలను వివరిస్తూ 1999లో ఇద్దరు చైనీస్ అధికారులు ఓ పుస్తకాన్ని రాశారు. పాశ్చాత్య దేశాలతో పోటీ పడలేని దేశాలు ఈ వ్యూహాలను అమలు చేయవచ్చునని వీరు పేర్కొన్నారు. కొన్నేళ్ళ నుంచి జరుగుతున్న పరిణామాలను పరిశీలించినపుడు చైనా ఈ విధానాలను అనుసరిస్తోందని స్పష్టమవుతోంది.
”అన్ రెస్ట్రిక్టెడ్ వార్‌ఫేర్ : చైనాస్ మాస్టర్ ప్లాన్ టూ డిస్ట్రాయ్ అమెరికా” అనే ఈ పుస్తకంలో అమెరికాతో ప్రత్యక్షంగా సైనిక యుద్ధాన్ని నివారించడానికి, అదే సమయంలో ఇతర మార్గాల్లో ఆ దేశాన్ని దెబ్బతీయడానికి అనుసరించవలసిన పద్ధతులను వివరించారు. ‘అమెరికన్ థింకర్’లో రచయిత జానెట్ లెవీ రాసిన వ్యాసంలో తెలిపిన వివరాల ప్రకారం, ఆర్థిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం, ఆర్థికపరమైన ఒడుదొడుకులను సానుకూలంగా మార్చుకోవడం, మౌలిక సదుపాయాలను నియంత్రణలోకి తెచ్చుకోవడం, సైబర్ దాడులు నిర్వహించడం, రాజకీయ ప్రచారం చేయడం, ఇతర పరోక్ష యుద్ధాలు చేయడం వంటివి వీటిలో ఉన్నాయి.
ఈ పద్ధతులను చైనా ప్రభుత్వం అంగీకరించి, అమెరికా మిత్ర పక్షమైన భారత దేశంపై ప్రయోగించేందుకు ఆమోదించింది. 1949లో చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టింది. ఈ ప్రాంతంలో తనకు దీటుగా సమాధానం చెప్పగలిగినది భారత దేశం మాత్రమేనని భావించింది. గడచిన రెండేళ్ళలో పరిస్థితులను పరిశీలించినపుడు మోసపూరితంగా భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం, సరిహద్దుల్లో ఘర్షణకు దిగడం, సైబర్ దాడులకు పాల్పడటం, సంప్రదాయేతర ఆయుధాలను వాడటం, ముంబైలో విద్యుత్తు సంక్షోభానికి కారణమవడం, పాకిస్థాన్‌తో స్నేహం చేయడం, జల వనరులను దారి మళ్ళించడం వంటి దుశ్చర్యలకు చైనా పాల్పడుతున్నట్లు తెలుస్తుంది.
మైక్రోవేవ్ ఆయుధాలు
గత ఏడాది భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, 75 మంది గాయపడ్డారు. ఈ సమయంలో చైనా మైక్రోవేవ్ ఆయుధాలను భారత దళాలపై ప్రయోగించినట్లు నిపుణులు చెప్తున్నారు. ఈ సరిహద్దు ప్రాంతంలో కాల్పులు జరపరాదనే నిబంధనలను తెలివిగా ఉల్లంఘిస్తోందని చెప్తున్నారు. ఈ ఆయుధాలు దాదాపు ఓ కిలోమీటరు పరిధిలో సమర్థవంతంగా పని చేస్తాయి.
మైక్రోవేవ్ ఆయుధాలను ప్రయోగించినపుడు దానికి గురయ్యేవారి రక్తం వేడెక్కిపోతుంది, వాంతులు వస్తాయి, తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ ఆయుధాలను చైనా వాడటం వల్ల భారతీయ దళాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చైనా ఈ పద్ధతులను ఈ ప్రాంతంలోని ఇతర దేశాలపై కూడా ప్రయోగించింది. ఆ దేశాలు నిరసన వ్యక్తం చేసినపుడు వెనుకకు వెళ్తూ, మళ్ళీ మళ్ళీ చొరబడేందుకు ప్రయత్నిస్తోంది.
సమన్వయంతోనే దాడులు
చైనా ఈ దాడులన్నిటినీ చాలా సమన్వయంతో నిర్వహిస్తోంది. లడఖ్‌లో ప్రతిష్టంభన సమయంలో ఇండియన్ ఐటీ, బ్యాంకింగ్ వ్యవస్థలపై ఐదు రోజుల్లో విపరీతంగా సైబర్ దాడులు జరిగాయి. ఇండియన్ నెట్‌వర్క్స్‌లో మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టడానికి చైనా స్పాన్సర్డ్ గ్రూపులు దాదాపు 40 వేల ప్రయత్నాలు చేశాయి. భారత దేశంలోని విద్యుత్తు, రవాణా రంగాల కార్యకలాపాలపై గూఢచర్యం చేశాయి. 2020లో ముంబైలో సుదీర్ఘ సమయంపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడానికి కారణం చైనా మిలిటరీ గ్రూప్ నిర్వహించిన సైబర్ దాడులేననే ఆరోపణలు ఉన్నాయి.
పొరుగు దేశాల్లో ప్రాబల్యం
బ్రహ్మపుత్ర నదిపై భారీ ఆనకట్టను చైనా నిర్మిస్తోంది. దీనిని కూడా తుపాకీ పట్టని యుద్ధంగానే చూడాలని ‘అమెరికన్ థింకర్’ పేర్కొంది. నేపాల్, భూటాన్, శ్రీలంక, పాకిస్థాన్‌లలో తన ప్రాబల్యాన్ని చైనా పెంచుకుంటోందని తెలిపింది.