ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు పదిహేను లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా సుమారు 89వేలమంది మరణించారు. మూడు లక్షల మంది పైచిలుకు దానితో పోరాడి విజయం సాధించారు. అయినప్పటికీ కేసుల సంఖ్యతో పోలిస్తే కోలుకున్నవారి సంఖ్య చాలా తక్కువ. ఈ క్రమంలో ఓ పిడుగులాంటి వార్త అందరినీ కలవరపెడుతోంది. కోలుకున్న కరోనా పేషెంట్లకు మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు లేకపోలేదని దక్షిణ కొరియాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అభిప్రాయపడింది. ద.కొరియాలో కరోనా నుంచి బయటపడి క్వారంటైన్‌లో ఉంటున్న 51 మంది పేషెంట్లకు మరోమారు పరీక్షలు నిర్వహించి చూడగా పాజిటివ్ అని తేలిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్‌కియాంగ్ వెల్లడించారు.