భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ చట్టాలను అమలు చేయడం విషయంలో ట్విట్టర్‌, కేంద్రం మధ్య పరిస్థితి జటిలం

 

భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ చట్టాలను అమలు చేయడం విషయంలో ట్విట్టర్‌, కేంద్రం మధ్య పరిస్థితి జటిలంగా మారుతుండగా మరోవైపు భారత ఐటీ చట్టాలకు లోబడి తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఫేస్‌బుక్‌ సిద్ధమవుతోంది. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు అనుగుణంగా ‘కంటెంట్‌’కి సంబంధించి లెక్కలు చెబుతామంటూ ఎఫ్‌బీ ప్రకటించింది. జులై 2న సోషల్‌ మీడియా దిగ్గజం స్థానిక చట్టాల ప్రకారం నడుచుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మే 15 నుంచి జూన్‌ 15 వరకు తాము ఫేస్‌బుక్‌ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించిన కంటెంట్‌కు సంబంధించిన వివరాలతో కూడిన మధ్యంతర నివేదికను జూన్‌ 2న సమర్పిస్తామని తెలిపింది. అంతేకాదు పూర్తి వివరాలతో కూడిన నివేదికను జులై 15 కల్లా అందుబాటులో ఉంచుతామంది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ప్రకటన జారీ చేశారు. ఆ వివరాలు ఇప్పుడే కాదు తమ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ మే 15 నుంచి జూన్‌ 15 వరకు ఆటోమేటెడ్‌ టూల్స్‌ ద్వారా తొలగించిన కంటెంట్‌ వివరాలు చెప్పేందుకు సిద్ధమైనా… అదే సమయంలో ఫేస్‌బుక్‌లో ఉన్న కంటెంట్‌పై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు వెంటనే వెల్లడించలేమని చెప్పింది. జులై 15 నాటికి ఆ వివరాలు అందుబాటులోకి వస్తాయంది. ఈ మేరకు వెబ్‌పేజీలో పోస్ట్‌ చేసింది. ఐటీ చట్టాలు మే 26 నుంచి కొత్త ఐటీ చట్టాలను కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం సోషల్‌ మీడియా సంస్థలు ప్రతీ నెల, తమకు అందిన ఫిర్యాదులు తీసుకున్న చర్యల వివరాలను ప్రచురించాల్సి ఉంటుంది. దీంతో పాటు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకుంటోంది. కాగా ట్విట్టర్‌ , కేంద్రం మధ్య ఈ విషయంపై వివాదం రోజురోజుకి ముదురుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *