జిల్లాలో శనివారం ఒక్కరోజే 11 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళన నెలకొంది. సూర్యాపేట పట్టణంలో 9, తిరుమలగిరి, నేరేడుచర్లలో ఒక్కో కేసు నమోదైంది. మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు వైరస్ అంటుకోవడంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీతోపాటు జిల్లాలోని నాగారం, తిరుమలగిరి, నేరేడుచర్ల మండలాలకు వైరస్ వ్యాప్తి చెందడంతో.. అధికారులు హై అలర్ట్ అయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ నెల 8న సూర్యాపేట పట్టణంలోని కొత్తగూడెం బజార్‌కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. కరోనా లక్షణాలు ఉండడంతో తానే స్వయంగా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షల్లో అతనికి పాజిటివ్ వచ్చినట్లు తేలిసింది. అయితే ఇతను పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఎవరిని కాంటాక్టు అయ్యాడన్న సమాచారం తొలుత తేలలేదు. ఇతని ద్వారా తన కూతురుకు కూడా శనివారం పాజిటివ్ వచ్చింది. కుడకుడ వ్యక్తినుంచి వర్ధమానుకోటలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి వైరస్ సోకితే, కొత్తగూడెం బజార్‌లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతుళ్లు వైరస్ బారినపడ్డారు. ఇతని నుంచే స్థానిక పాత మార్కెట్ పరిధిలోని మరో 8 మందికి కరోనా సోకినట్లు శనివారం రాత్రి అధికారులు ప్రకటించారు.