ఏపీలో త్వరలోనే నూతన రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. నవ దంపతులకు కొత్త కార్డులు జారీ చేయనుండగా, పేర్ల మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీల రంగులతో ఇచ్చిన రేషన్ కార్డులకు చరమగీతం పాడడంతో పాటు అత్యాధునిక కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ సన్నాహాలు ప్రారంభించారు.
ఆరునెలల పాలనా కాలంలో క్రమంగా అధికార యంత్రాంగాన్ని గాడిన పెడుతూ వస్తున్న కూటమి ప్రభుత్వం.. క్రమంగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖలోని అవినీతిపై పెద్ద ఎత్తున దాడులు చేస్తూ.. అక్రమార్కుల ఆట కట్టించింది. ఇక ఇప్పుడు.. నూతన లబ్ధిదారుల ఎంపిక, వారికి జారీ చేయనున్న కార్డుల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ఆగిపోగా.. అనేక మంది లబ్దిదారులకు కార్డులు జారీ కాలేదు. అలాంటి వారందరికీ ఇప్పుడు.. సరికొత్త కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా పెళ్లైన దంపతులకు, రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పించనున్నారు. ఇందు కోసం.. ప్రత్యేకంగా.. ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభించనున్నారు. అందుబాటులోని సాంకేతికతను వినియోగించుకుని.. ఇకపై రేషన్ కార్డుల్ని క్రెడిట్ కార్డుల తరహాలో క్యూఆర్ కోడ్ లతో జారీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే.. సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల చివర్లో కానీ, వచ్చే నెల ప్రారంభంలో కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా కార్డుల్ని జారీ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
కొత్త కార్డులపై క్యూఆర్ కోడ్ ఉండనుండగా.. అందులో కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు ఉండనున్నాయి. రేషన్ పంపిణీ సమయంలో ఆ కోడ్ ను స్కాన్ చేస్తే పూర్తి వివరాలు తెలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపితే.. వెంటనే కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం.. అధికార యంత్రాగం, ప్రభుత్వం వివిధ పనుల్లో బిజీబిజీగా గడుపుతోంది. తీరికలేని హడావిడిలో ఉండడంతోనే.. కార్డుల ఆమోదం, జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
గత ప్రభుత్వం హయంలో కొత్తగా పెళ్లైన వాళ్లకు వెనువెంటనే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. కానీ.. కొన్ని నెలలకే ఆ విధానాన్ని పక్కన పెట్టేశారు. ఆరునెలలకు ఓ సారి మాత్రమే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. దాంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మంజూరు చేయాల్సిన కొత్త కార్డులు చాలానే మిగిలిపోయాయి. ఈసారి వాటిని జారీ చేయడంతో పాటు వెనువెంటనే నూతన దంపతులకు కార్డులు మంజూరు చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని చాలా రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు తప్పుల తడకగా మారాయి. దాంతో.. అనేక పథకాల లబ్ధిదారులు నష్టపోతున్నారు. పేర్లు తేడాగా ఉంటున్న కారణంగా చాలా పథకాలకు అనుసంధానించేందుకు వీలు కావడం లేదు. పైగా..ఆన్ లైన్ విధానాన్ని సైతం ఆపేయడంతో.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఈ సమస్యలన్నింటినీ ఈ సారి నూతన కార్డుల జారీ సమయంలో పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉండగా.. 3.36 లక్షల రేషన్ కార్డు సమస్యలు పెండింగ్ లో ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో.. 70 వేలకు పైగా నవదంపతుల నుంచి అందిన దరఖాస్తులుగా చెబుతున్నారు. కార్డుల్లో విభజన కోసం 46 వేలకు పైగా, కొత్త సభ్యుల చేరికలకు 2 లక్షల 13 వేలు, సభ్యులను తొలగించేందుకు 36 వేలు, అడ్రస్ మార్పుల కోసం 9 వేలకు పైగా దరఖాస్తులు అందగా.. రేషన్ కార్డుల్ని సరెండర్ చేసేందుకు 685 మంది సిద్ధంగా ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇలా.. అన్ని రకాలుగా చూస్తే మరో 2 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అధికారుల అంచనా. దాంతో.. రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.50 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు