భారతదేశ సంపన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని పైన యూఎస్ లో లంచం మరియు మోసం ఆరోపణలతో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అదానీతో ఒప్పందం చేసుకుందని ఈ మేరకు భారీగా ముడుపులు ముట్టాయని ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతుంది.
ఏపీలో వైసీపీ మెడకు అదానీ వ్యవహారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పందాల కోసం జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులకు 228మిలియన్ డాలర్లు, దాదాపు రూ.1750కోట్ల లంచాలను ఇచ్చినట్టు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణలలో ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు మాజీ మంత్రులు ఈ వ్యవహారం పైన స్పందిస్తున్నారు. రాష్ట్రంలో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి తో మాత్రమే ఒప్పందం చేసుకుందన్నారు.
ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్న మాజీ మంత్రి
అదాని గ్రూప్ తో ఏపీ డిస్కంలు ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఇక తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మాజీమంత్రి వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోలార్ విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి అదానీ సంస్థతో గత ప్రభుత్వం ఎటువంటి ఒప్పందం చేసుకోలేదని ఆయన తేల్చి చెప్పారు. ఒప్పందం కుదుర్చుకుందని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు.
గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ప్రధాని ప్రారంభిస్తారనే ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రారంభిస్తారని గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు.
ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదు
ప్లాంట్ కు సంబంధించిన భూకేటాయింపులు మా ప్రభుత్వ హయాం లోనే జరిగాయని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో తాము ఎన్నో కార్యక్రమాలను అమలు చేశామని చెప్పిన గుడివాడ అమర్నాథ్, విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు.