కోవిడ్‌ రోగులకు చికిత్స చేయాలంటూ ట్రంప్‌ కామెంట్లు

అమెరికా :   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌–19 అమెరికాను అతలాకుతలం చేస్తూ ఉంటే చేష్టలుడిగి చూస్తున్న ట్రంప్‌ అత్యంత ప్రమాదకర సలహాలు ఇవ్వడానికీ వెనుకాడటం లేదు. అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తాజా అధ్యయనంలో సూర్యరశ్మి, గాలితో తేమ కరోనా వైరస్‌ను చంపేస్తుందని తేలింది. దీంతో ట్రంప్‌ కోవిడ్‌ రోగులకు వైరస్‌ను నాశనం చేసే రసాయనాలు ఇంజెక్ట్‌ చేయాలని, అతినీలలోహిత కిరణాలను రోగుల శరీరంలోకి పంపించి వైరస్‌ను చంపాలని సలహా ఇచ్చారు. వైట్‌ హౌస్‌లో గురువారం విలేకరుల సమావేశంలో హోంల్యాండ్‌ సెక్యూరిటీ చేసిన అధ్యయనం ఫలితాలను ఆ శాఖ సహాయ మంత్రి బిల్‌ బ్రయాన్‌ వెల్లడించిన వెంటనే ట్రంప్‌ కోవిడ్‌ రోగుల్లోకి వైరస్‌ను చంపేసే రసాయనాలు ఇంజెక్ట్‌ చేయాలని సలహా ఇచ్చారు. ‘రసాయనాలు, ఎండ తీవ్రతకి వైరస్‌ కేవలం నిముషంలోనే చచ్చిపోవడం చూస్తున్నాం. కోవిడ్‌ రోగుల ఊపిరి తిత్తుల్లోకి అల్ట్రావయోలెట్‌ కిరణాల్ని పంపించి చంపలేమా ? అది ఎలా చేయాలో ఆలోచించండి’అంటూ వ్యాఖ్యాని ంచడం అందరినీ విస్మయంలోకి నెట్టేసింది.  ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయనపై విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తాయి. రోగుల ప్రాణాలతో ఆడుకునే అలాంటి ప్రమాదకరమైన సలహాలు పాటించవద్దంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. కరోనా మహమ్మారిపై సమాచారాన్ని ఇతర దేశాలతో పంచకుండా ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన చైనా తగిన మూల్యం చెల్లించు కుంటుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *