ఈవీఎం ట్యాంపరింగ్‌పై మౌనం వీడిన సీఈసీ..!

ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై బీజేపీయేతర పార్టీలన్నీ కూడా అభ్యంతరాలను వ్యక్తం చేస్తోన్నాయి. ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.

 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్‌లో సునామీ సృష్టించిన ఆ పార్టీ..ఈవీఎంలను తెరిచిన తరువాత కుప్పకూలింది. ఈవీఎం కౌంటింగ్‌ ఆరంభమైన తరువాత భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లింది. భారీ మెజారిటీని సాధించింది.

 

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి గంటలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 71 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు. ఆ తరువాత ఫలితాలు తారుమారు అయ్యాయి. బీజేపీ ఒక్క ఉదుటున ఆధిక్యతను సాధించింది. అప్పటివరకు కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. చివరికి- 48 సీట్లతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది హర్యానాలో.

 

ఈ పరిణామాలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఈవీఎంల పనితీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎక్కడో లెబనాన్‌లో ఉన్న పేజర్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇజ్రాయెల్ పేల్చివేయగా లేనిది ఈవీఎంలను ట్యాంపర్ చేయకపోవడమేంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈవీఎంలను ట్యాంపర్ చెయ్యొచ్చంటూ ఎలాన్ మస్క్, శామ్ పిట్రోడా వంటి వాళ్లు తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం స్పందించారు. దేశంలో మళ్లీ పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగించడం సమర్థనీయం కాదని చెప్పారు.

 

ఈ పరిణామాలపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవని అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనడం ద్వారా ప్రజలు ఆయా ప్రశ్నలకు సమాధానాలను ఇస్తారని వ్యాఖ్యానించారు.

 

ఈవీఎంల ట్యాంపరింగ్ విషయాన్ని తోసిపుచ్చారు రాజీవ్ కుమార్. అవి 100 శాతం ఫూల్‌ప్రూఫ్‌గా ఉన్నాయని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా గానీ, ఇతర సమయాల్లో గానీ కాంగ్రెస్, ఇతరులు లేవనెత్తే ప్రశ్నలకు ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *