ఇద్దరు మంత్రులకు కీలక భాద్యతలు అప్పగించిన అధిష్టానం..?

తెలంగాణకు చెందిన ఇరువురు మంత్రులకు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అతిపెద్ద బాధ్యతను అప్పగించారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఇక ఎన్నికల సందడి నెలకొననున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, జార్ఖండ్ 81 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇక కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనే తరువాయి.

 

అందుకు ముందుగానే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలలో జమ్ము కాశ్మీర్ ను కాంగ్రెస్ కూటమి వశం చేసుకోగా.. హర్యానాను బిజెపి దక్కించుకుంది. ఈ రెండు రాష్ట్రాలలో పోటాపోటీగా ప్రచారం సాగించి, ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్, బిజెపిలకు చెరో ఒక రాష్ట్రం దక్కింది. ఇక తాజాగా మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది.

 

ఈ మేరకు ఏఐసిసి ప్రకటన జారీ చేయగా.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుండి ఇరువురు మంత్రులపై సరికొత్త బాధ్యతను కాంగ్రెస్ పెద్దలు ఉంచారు. వారిలో రాష్ట్ర మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా.. వీరు మహారాష్ట్ర పార్టీ సీనియర్ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. నార్త్ మహారాష్ట్ర కు సీతక్క, మరత్వాడ కు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పార్టీ స్థితిగతులను పరిశీలిస్తూ వాటిని చక్కదిద్దుతారు.

 

అంతేకాకుండా మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. ఇక నామినేషన్ ల పర్వం, ప్రచారాల మోతలు ఇక్కడ మ్రోగనున్నాయి. కాగా మహారాష్ట్రకు సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకొనేందుకు ఎట్టి పరిస్థితుల్లో అన్ని పార్టీలతో కలవాలన్నారు.

 

అందుకు తాను కూడా సహకరిస్తానని, అయితే చర్చలు జరగాలని సూచించారు. హైదరాబాద్ ఎంపీగా గల అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయని చెప్పవచ్చు. అలాగే అక్కడ బీజేపీ ఓటమి కోసం తాను కాంగ్రెస్ కు సహకరిస్తానంటూ ప్రకటన ఇచ్చారు. కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుంటే మాత్రం.. ఎంఐఎం దారి వేరుగా ఉంటుందని అసదుద్దీన్ చెప్పారు.

 

ఈ ప్రకటన ఓవైసీ చేసిన కొద్దిరోజులకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించడం, అందులో తెలంగాణకు చెందిన ఇరువురు మంత్రులకు చోటు దక్కడం విశేషం. మరి ఓవైసీ సహకారాన్ని మహారాష్ట్రలో కాంగ్రెస్ తీసుకుంటుందా.. లేదా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఎంఐఎం మద్దతు కోరుకుంటే మాత్రం.. దౌత్యానికి తెలంగాణ మంత్రులను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *