48 గంటల్లోనే అత్తా కోడళ్లపై అత్యాచారం నిందితులను అరెస్ట్ చేశాం : హోంమంత్రి అనిత..

ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లాలో అర్థరాత్రి అత్తాకోడళ్లపై జరిగిన అత్యాచారం ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు 48 గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే నిందితులకు కఠిన శిక్షలు వేగంగా పడాలన్న లక్ష్యంతో కేసును స్పెషల్ కోర్టుకు అప్పగించామన్నారు.

 

మహిళల సేఫ్టీకే ఫస్ట్ ప్రయారిటీ :

 

ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతగా భావిస్తోందన్న అనిత, సత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగించడమే ఇందుకు నిదర్శమన్నారు. వేగవంతమైన విచారణ కోసమే ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు భరోసా ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

 

ఒకరిపై 37 కేసులు…

 

నిందితుల్లో ఐదుగురు పట్టుబడ్డారని, అందులో ఒకరిపై అత్యాచార అభియోగాలతో పాటు మరో 37 కేసులు ఉన్నట్లు హోంమంత్రి వెల్లడించారు. ఇక మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై తాము సహించబోమని అల్టిమేటం జారీ చేశారు.

 

సీసీటీవీలను ప్రజలంతా ఏర్పాటు చేసుకోవాలి…

 

ఏపీలో ప్రజలంతా సీసీటీవీ కెమెరాలను తప్పక ఏర్పాటు చేసుకోవాలని అనిత సూచించారు. అవి లేని చోట డ్రోన్స్‌ వినియోగించాలన్నారు. డ్రోన్స్‌ కూడా లేకపోతే సెల్ఫోన్లను వాడుకోవాలన్నారు. ఏ చిన్న ఇబ్బంది కలిగినా వీడియో తీస్తున్న సమాజం అని, తమకు అలా సమాచారం అందితే వారి వివరాలను ఎక్కడా బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. నేరాల నియంత్రణే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమన్నారు. ఎక్కడ నేరం జరిగినా అలెర్ట్ అవ్వాలని చెప్పారు. నేరం చేస్తే నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

 

ప్రజలంతా కలిసిరావాలి…

 

ఇక నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ద్వారా నిఘూ పెట్టేందుకు కార్యచరణ ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ప్రజలనూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నామన్నారు. కాలనీల్లో, ఇళ్ల వద్ద, వ్యాపార వాణిజ్య సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పోలీస్ శాఖకు అనుసంధానం చేయాలని సూచించారు. ఫలితంగానే నేర నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.

 

నేర నియంత్రం కోసం అలా చేయాలి…

 

పోలీసులకు ఆయుధాలున్నట్లు, పబ్లిక్ వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. దీంతో ఆయా సాధనాలను ఉపయోగించి క్రైమ్ కంట్రోల్ కోసం సహకరించాలని సూచించారు. నేరాలపై పోలీసులకు సమాచారం ఇచ్చే పౌరుల వివరాలు తాము ఎవరితోనూ పంచుకోమని, అలాంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, పోలీసులతో సిటిజన్లు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *