‘అలయ్ బలయ్’లో రగడ.. కేంద్ర మంత్రి Vs రాష్ట్ర మంత్రి..

ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా దసరా తర్వాతి రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. రాజకీయ పార్టీల నేతలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ దిగ్విజయంగా నిర్వహిస్తూవస్తున్నారు.

 

చర్చనీయాంశంగా నేతల ప్రసంగాలు…

 

గతంలో దత్తాత్రేయనే స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, కొన్నేళ్లుగా ఆయన కుమార్తె విజయలక్షి జరుపుతున్నారు. ఈసారి నిర్వహించిన కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరవ్వగా, సీపీఐ నారాయణ బాయ్‌కాట్ చేశారు. అయితే, సఖ్యత, సమైక్యతకు స్ఫూర్తినిచ్చే ఈ వేదికపై బీజేపీ, కాంగ్రెస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 

విమర్శలు హద్దుమీరుతున్నాయి…

 

అలయ్ బలయ్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతోపాటు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు హద్దుమీరుతున్నాయని అన్నారు. వారి ప్రసంగాల్లో, భాషలో మార్పు రావాలని ఆకాంక్షించారు. విమర్శించుకుందాం కానీ, ప్రజలు అసహ్యించుకునేలా మాట్లాడకండి అంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు ఘర్షణ పడొచ్చు కానీ, ఎన్నికలయ్యాక ప్రజల శ్రేయస్సే ముఖ్యమని హితవు పలికారు. పార్టీలు విమర్శించుకుంటున్న విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని కిషన్ రెడ్డి, పరోక్షంగా కాంగ్రెస్ నాయకులపై సెటైర్లు వేశారు.

 

పొన్నం కౌంటర్ ఎటాక్

 

కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అదే వేదికపై ఇన్‌డైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయాల్లో భాష ముఖ్యమని, వేరేవాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నది నిజమేనని అన్నారు. అయితే, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా స్వీయ నియంత్రణ అవసరమంటూ కౌంటర్ వేశారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా దత్తాత్రేయ చొరవ చూపాలని కోరారు మంత్రి. వీరిద్దరు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *