ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. తగ్గేదే లేదంటూ అధికార, ప్రతిపక్షాలు సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ వ్యవహారం బుక్ ల వైపు మళ్లింది. ఇప్పటికే లోకేష్ రెడ్ బుక్ హాట్ టాపిక్ అవ్వగా.. మాజీ సీఎం జగన్ గుడ్ బుక్ కోసం పిలుపునిస్తున్నారు. రెడ్ బుక్ మెయింటేన్ చేయడం పెద్ద పనా ? అంటూనే పార్టీ బలోపేతానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి నేతలే జగన్ పై వాగ్బాణాలు సంధిస్తుండడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
యువగళం పాదయాత్ర సమయంలో తెలుగుదేశం శ్రేణులు, ప్రజల పట్ల వైసీపీ నేతలు, కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో చలించిపోయిన లోకేశ్.. రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని హద్దులుదాటి ప్రవర్తించిన వైసీపీ నేతలు, అధికారుల పేర్లను ఆ రెడ్ బుక్‌లో ఎంటర్ చేస్తూ వచ్చారు.. వారిపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. అప్పట్లో రెడ్ బుక్‌పై వైసీపీ నేతలు సెటైర్లు కూడా వేశారు.
కూటమి ప్రభంజనం సృష్టిస్తూ విజయం సాధించడంతో ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ముందు వరకు రెడ్‌బుక్ అంటే పట్టించుకోని జగన్.. ఇప్పుడు మాట్లాడితే రెడ్‌బుక్ అంటూ వణికిపోతున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోకేశ్ రెడ్‌బుక్ పేరువింటేనే జగన్ సైతం భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. మంత్రి లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ అంశంపై మరోసారి స్పందించారు. మంగళగిరిలో వైసీపీ నేతలతో జరిగిన భేటీలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. రెడ్ బుక్ అంటూ ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చిందన్నారు. కక్ష పూరిత పాలన సాగిస్తోందని ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ మెయింటేన్ చేయడం పెద్ద పనా ? అంటూ జగన్ ప్రశ్నించారు. మనం గుడ్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుదామంటూ పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నాం.. వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయని జగన్ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు జగన్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఢీ అంటే ఢీ అనేలా ఉంటామంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు రావడం సర్వసాధరమణన్న జగన్.. కష్టాల నుంచే హీరోలు పుడతారన్నారు. అసలైన నాయకులు పుట్టేది కూడా ఇప్పుడేనని చెప్పుకొచ్చారు. ఐదేళ్లపాలనలో ప్రతి ఇంటికీ మనం మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టే పార్టీ వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు.
చిరునవ్వుతోనే పాలన సాగించి, చెప్పిన ప్రతి మాట నెరవేర్పుతూ, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా పాలన చేస్తూ మార్పులు తీసుకువచ్చామన్నారు జగన్. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. అన్ని రంగాల్లో గొప్ప మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పుడు పరిస్థితులు ఏంటో మీరు చూడండి.. ప్రతి అంశంలోనూ తిరోగమనం కనిపిస్తుంది.. వివక్ష, పక్షపాతం కనిపిస్తున్నాయని ఆరోపించారు. ప్రతి ఇంట్లోనూ దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోందని.. జగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. ఇప్పుడు పలావూ పోయింది.. బిర్యానీ పోయిందనే చర్చ జరుగుతోందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు, అధికారం లేనప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటకు వస్తుందన్నారు. చీకటి తర్వాత కచ్చితంగా వెలుతురు వస్తుందని చెప్పారు.
ఇక జగన్ కామెంట్స్ కి బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి కౌంటరిచ్చారు. పుస్తకాలు రాయడం, చదవడం మంచి అలవాటేనన్నారు. అందుకోసం నోట్ బుక్, పెన్నులు పంపుతున్నామని సెటైర్ వేశారు. ఆ గుడ్ బుక్ లో రక్త చరిత్ర రాయాలని.. గొడ్డలి పోటు… గుండెపోటుగా ఎలా మారిందో రాయాలని చెప్పుకొచ్చారు.
అంతకు ముందు కూడా జగన్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఏపీలో అరాచక పాలన జరుగుతుందంటూ జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి వచ్చారు. ఆ ధర్నా సమయంలో లోకేశ్ రెడ్‌బుక్‌ను జగన్ ప్రధానంగా ప్రస్తావించారు.