నాగార్జున కేసులో మంత్రి సురేఖకు నోటీసులు.. ఇక కేటీఆర్ కూడా.. ?

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ఆమె చేసిన కామెంట్స్ సెగ ఇంకా తాకుతూనే ఉంది. మంత్రి కొండా సురేఖ గతంలో తనపై వచ్చిన ట్రోలింగ్స్ కి మనస్థాపం చెందారు. దీనితో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. తనపై వస్తున్న ట్రోలింగ్స్ కి కేటీఆర్ కు సంబంధం ఉందంటూ ఆరోపిస్తూ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

 

అలాగే హీరోయిన్ సమంతా పేరును సైతం తెరపైకి తీసుకురాగా.. సమంతా కూడా ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం తగదని, ఇటువంటి వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతింటాయని సమంతా అన్నారు. సమంతా ప్రకటనతో వెంటనే తేరుకున్న మంత్రి సురేఖ సారీ సమంత అన్నారు.

 

ఇక రాజకీయ విమర్శల వరకు ఒకేగానీ.. అసలు సంబంధం లేని తమ పేర్లు పలకడంపై.. అక్కినేని ఫ్యామిలీ గుర్రుమంది. దీనితో సినిమా ఇండ్రస్ట్రీ మొత్తం ఒక్కసారిగా నాగార్జునకు మద్దతుగా మంత్రి సురేఖ పై విమర్శల వర్షం కురిపించింది. అంతేకాదు పలు మహిళా సంఘాలు సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టాయి. ఈ విమర్శలకు మనసు నొచ్చుకున్న మంత్రి సారీ చెప్పినా కూడా.. పరిస్థితి అలాగే ఉన్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వివాదాన్ని సద్దుమణిగించే పనికి పూనుకున్నారు. స్వయంగా ఒక వీడియో విడుదల చేసి సారీ చెప్పి.. ఇక ఈ విషయాన్ని వదిలివేయండి అంటూ కోరారు.

 

ఇక వివాదం సద్దుమణిగిందన్న క్రమంలో అక్కినేని నాగార్జున తన పరువుకు నష్టం వాటిల్లిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనితో నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇప్పటికే నాగార్జున వాంగ్మూలాన్ని సైతం నమోదు చేసింది. గురువారం ఈ కేసుకు సంబంధించి నాగార్జున పిటిషన్ లో రెండో సాక్షి వెంకటేశ్వర వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేశారు. అనంతరం మంత్రి సురేఖకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసి, 23న వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను 23వతేదికి వాయిదా వేసింది.

 

మంత్రి సురేఖ వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ సైతం పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర రావు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్ , సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను సాక్షులుగా పేర్కొన్నారు. ఇలా తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ఇప్పటికే నాగార్జున కేసులో నోటీసులు జారీ కాగా.. తాజాగా కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసును కూడా మంత్రి ఎదుర్కోవాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *