ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను బుధవారం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయడాన్ని నిరసిస్తూ మందకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నుంచి మాదిగల నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే ఈ నిరసనను పోలీసుల అడ్డుకున్నారు. మందకృష్ణ మాదిగతోపాటు పలువురు ఎమ్మార్పీఎస్ నేతలను ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు.
స్వల్ప ఉద్రిక్తత
కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఇందిరాపార్క్ ధర్నాచౌక్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీగా బయలుదేరారు. కాగా, ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎమ్మార్పీఎస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట, కాసేపు స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.
సర్కారు క్లారిటీ..
వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి, ముందుగా రాష్ట్రంలో వర్గీకరణ కోటాను ప్రకటించాలని ఎమ్మార్సీఎస్ అధినేత డిమాండ్ చేస్తు్న్నారు. ఈ పనిచేయకుండానే తెలంగాణ ప్రభుత్వం హడావుడిగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తోందని, దీనివల్ల మాదిగలు నష్టపోతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 60 రోజుల వరకు తెలంగాణలో నోటిఫికేషన్లు ఇవ్వబోమని.. ఎస్సీ వర్గీకరణ చేసిన తరువాత నోటిఫికేషన్లను విడుదల చేస్తామని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.